: చెన్నైలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం, 450కి పెరిగిన చెన్నై మృతులు... సాయం అరకొరే!
తిరిగి సాధారణ స్థితికి చేరుకునే క్రమంలో తలమునకలైన చెన్నై నగరవాసులపై వరుణుడు మరోమారు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ ఉదయం నుంచి చెన్నై నగర వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. తాంబరం, మెడిచ్చూర్, మీనంబాక్కం, రామాపురం, కొట్టివాక్కం, ఆడంబాక్కం తదితర ప్రాంతాల్లో ఇంకా మూడు నుంచి ఐదు అడుగుల మేరకు నీరు నిలిచివుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి నీటి మట్టం మరింతగా పెరగవచ్చని అంచనా. కాగా, వరదలు, వర్షాలు, ఇండ్లు కూలిపోవడం తదితర కారణాల వల్ల మరణించిన వారి సంఖ్య 450కి పెరిగింది. ఇక బయటి నుంచి అందుతున్న సాయం ఏ మాత్రం సరిపోవడం లేదని తెలుస్తోంది. జయలలిత సర్కారు సైతం తమను ఆదుకోవడంలో విఫలమైందన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. బయటి ప్రాంతాల నుంచి వస్తున్న సాయం, అవసరం ఉన్న పేద ప్రజల చెంతకు చేరడం లేదని వారు వాపోతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్న వారికి సరైన చికిత్సలు అందడం లేదని ఆరోపిస్తున్నారు. పలు కాలనీల్లో విద్యుత్ కోతలతో పాటు విషజ్వరాల పాలౌతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా, ప్రభుత్వ అధికారులు మాత్రం తాము శక్తిమేరకు కృషి చేస్తూ, ప్రజలను ఇబ్బందుల నుంచి తప్పించేందుకు యత్నిస్తున్నామని చెబుతున్నారు.