: నేడు బ్లాక్ డే... జల్లెడ పడుతున్న పోలీసులు
డిసెంబర్ 6... ఓ వైపు బ్లాక్ డే, మరోవైపు విజయ్ దివస్. హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నేటి నుంచి రేపు ఉదయం 6 గంటల వరకూ పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు, సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. పలుచోట్ల పోలీసు పికెట్ లను ఏర్పాటు చేసినట్టు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. 150 మంది ఎస్సైలు, 50 మంది సీఐలు, 20 ప్లాటూన్ల పారామిలటరీ, స్థానిక పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించినట్టు తెలిపారు. మరోవైపు పాతబస్తీలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, వజ్ర టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్, వాటర్ కేనన్ బలగాలు మోహరించాయి. కాగా, అసోంలో జంట పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.