: కోయంబత్తూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య!
తమిళనాడు రాష్ట్రంలోని ఒక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోయంబత్తూర్లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో సేలమ్ జిల్లా మెట్టూరుకు చెందిన సింతియా ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలకు చెందిన హాస్టల్లో సింతియా ఉంటోంది. హాస్టల్ భవనంలోని రెండో అంతస్తు పైనుంచి దూకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి రూమ్ మేట్స్ నుంచి పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లారు. సింతియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.