: అడిగిన దానికన్నా ఎక్కువిచ్చారు... చాలా థ్యాంక్స్: చంద్రబాబు


రాబోయే పదేళ్లలో దేశంలోని మూడు పెద్ద రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలుస్తుందని... 2029 నాటికి దేశంలోనే అగ్రస్థానాన్ని ఆక్రమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ రింగురోడ్డు కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ. 20 వేల కోట్లను మంజూరు చేయడం సంతోషకరమని చెప్పారు. రానున్న రోజుల్లో అమరావతి చుట్టూ 220 కిలోమీటర్ల రింగురోడ్డు వస్తుందని తెలిపారు. విజయవాడలో పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సహకారంతో ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి రూ. 65 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసినందుకు గడ్కరీకి థ్యాంక్స్ చెప్పారు. తాము అడిగిన దానికన్నా గడ్కరీ ఎక్కువ ప్రకటించారని కొనియాడారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అందిస్తున్న తోడ్పాటు చాలా గొప్పదని... ఆయన వల్లే పోలవరం ముంపు ప్రాంతంలో ఉన్న ఏడు మండలాలు ఏపీలోకి వచ్చాయని... ఆ మండలాలు తెలంగాణలో ఉంటే పోలవరం నిర్మాణం సాధ్యమయ్యేది కాదని చెప్పారు. కనకదుర్గమ్మ గుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ కు 'కనకదుర్గ ఫ్లై ఓవర్' అని నామకరణం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News