: సుష్మా పాక్ పర్యటన ఖరారు... 8న ఇస్లామాబాద్ కు పయనం
భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్ పర్యటన దాదాపుగా ఖరారైంది. పాక్ రాజధాని ఇస్లామాబాదులో ఆఫ్ఘానిస్థాన్ కు ప్రాంతీయ సహకారంపై ఈ నెల 9న జరగనున్న సదస్సులో పాల్గొనేందుకే సుష్మా పాక్ వెళుతున్నారు. ఇటీవల ప్రపంచ వాతావరణ సదస్సులో భాగంగా ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ ల మధ్య చోటుచేసుకున్న ఆత్మీయ పలకరింపు నేపథ్యంలోనే సుష్మాకు పాక్ ఆహ్వానం పంపింది. దీనికి సుష్మా సానుకూలంగానే స్పందించినప్పటికీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దీనిపై నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సివచ్చింది. అయితే సుష్మా పాకిస్థాన్ పర్యటనకు ప్రభుత్వం కూడా అనుమతించిందని విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఈ నెల 8న ఇస్లామాబాదు వెళ్లనున్న సుష్మా, సమావేశం అనంతరం మరునాడు సాయంత్రం తిరిగి వస్తారు. రెండు రోజుల పర్యటన అని చెబుతున్నా, ఇస్లామాబాదులో సుష్మా కేవలం 24 గంటల కంటే తక్కువ సమయమే ఉండనున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ ను వెంటబెట్టుకుని వెళ్లనున్న సుష్మా, అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో పాటు ఆయనకు విదేశీ వ్యవహరాల సలహాదారైన సర్తాజ్ అజీజ్ తోనూ భేటీ కానున్నట్లు సమాచారం.