: మళ్లీ ఎంట్రీ ఇచ్చిన సైకో సూదిగాడు... వనస్థలిపురంలో మహిళపై సిరంజీ దాడి
ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు హైదరాబాదు, తెలంగాణలోని పలు జిల్లాల్లో కలకలం రేపిన సైకో సూదిగాడు మళ్లీ రంగప్రవేశం చేశాడు. హైదరాబాదు శివారు ప్రాంతం వనస్థలిపురంలో రోడ్డుపైకి వచ్చిన సైకో ఓ మహిళపై సిరంజీతో దాడి చేశాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న వనస్థలిపురం వాసి రమాదేవి అనే మహిళ నేటి ఉదయం బైక్ పై వెళుతుండగా, హఠాత్తుగా ప్రత్యక్షమైన సైకో ఆమెపై సిరంజీతో దాడి చేశారు. దాడితో బెంబేలెత్తిపోయిన రమాదేవి, కేకలు వేసేలోగానే సైకో అక్కడి నుంచి మాయమయ్యాడు. అనంతరం స్థానికుల సహాయంతో రమాదేవి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.