: చంద్రబాబు పేరును తొలగిస్తేనే పిటిషన్ విచారణ... గంగిరెడ్డి భార్యకు హైకోర్టు వెల్లడి
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్తకు ఏపీ జైళ్లలో ప్రాణహాని ఉందని గంగిరెడ్డి సతీమణి మాళవిక హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో గంగిరెడ్డిని తెలంగాణలోని జైళ్లకు మార్చాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై నిన్న స్వల్ప విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, ప్రతివాదుల జాబితాలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేరును ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతివాదుల జాబితా నుంచి చంద్రబాబు పేరును తొలగిస్తేనే పిటిషన్ పై తదుపరి విచారణను చేపడతామని పిటిషనర్ కు తేల్చిచెప్పారు. అందుకు పిటిషనర్ ఒప్పుకున్న పక్షంలో జాబితా నుంచి చంద్రబాబు పేరును తొలగించి పిటిషన్ కు నెంబరు కేటాయించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు.