: చిత్తూరులో చైనా కార్ల తయారీ యూనిట్!
నవ్యాంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో పరుగులు పెట్టనుంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించారు. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ఆయా దేశాల ఇండస్ట్రియలిస్టుల ముందు పెట్టారు. చంద్రబాబు కష్టానికి ఫలితాలు రావడం మొదలైంది. ఇప్పటికే నూతన రాజధాని అమరావతితో పాటు విశాఖ, అనంతపురం తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తమ కార్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తామంటూ చైనాకు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు నిన్న విజయవాడలో సదరు కంపెనీ ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. కంపెనీ ప్రతినిధుల ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు చిత్తూరులో భూమి కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు.