: అమరావతి నిధులు ఇరిగేషన్ ప్రాజెక్టులకు మళ్లింపు... ఏపీ సర్కారు నిర్ణయంపై కేంద్రం ఆగ్రహం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,850 కోట్లన్నీ దారి మళ్లాయి. ఈ మొత్తం నిధుల్లో సింగిల్ పైసా కూడా నిర్దేశిత పనులకు వినియోగించలేదు. మొత్తం నిధులన్నింటినీ ఏపీ సర్కారు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసేసింది. అయితే ఏ పని కోసం నిధులు విడుదల చేశామో, ఆ పనులకు కాకుండా ఇతర రంగాలకు నిధులను ఎలా మళ్లిస్తారంటూ కేంద్రం ఏపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక సదరు నిధుల వినియోగంపై యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) ఇస్తే కాని, కొత్తగా నిధులు విడుదల చేసేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ఏపీ సర్కారు అయోమయంలో పడిపోయింది. అసలే ఆర్థిక లోటు.. ఆపై నిధుల లేమి.. సంక్షేమ పథకాల అమలు... ఈ క్రమంలో రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో అందుకోసం విడుదల చేసిన నిధులను ఇతరాలకు వినియోగించామని, భవిష్యత్తులో సదరు రంగాలకు కేటాయించిన నిధుల్లో నుంచి అంతే మొత్తంలో నిధులను రాజధాని నిర్మాణానికి మళ్లిస్తామని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా నిధులెలా మళ్లిస్తారంటూ కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేయడమేమిటని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.