: బెజవాడలో మిస్ ఫైర్... ఎన్ఎస్జీ కమెండోకు బుల్లెట్ గాయం!
నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడలో నిన్న చోటుచేసుకున్న మిస్ ఫైర్ ఘటనలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ)కి చెందిన ఓ కమెండోకు తీవ్ర గాయమైంది. నగరంలో జరుగుతున్న ఓ శిక్షణ కార్యక్రమానికి వెళుతున్న సందర్భంగా కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ అనే కమెండో వేసుకున్న జాకెట్ లోపల ఉంచిన 9ఎంఎం పిస్టల్ అకస్మాత్తుగా పేలింది. దీంతో శ్రీనివాస్ కుడికాలులోకి బుల్లెట్ దూసుకుపోయింది. వేగంగా స్పందించిన సహచర కమెండోలు శ్రీనివాస్ ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం ప్రత్యేక విమానంలో అతడిని ఢిల్లీలోని ఎన్ఎస్జీ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. దేశంలోనే సుశిక్షిత కమెండోలుగా పేరుగాంచిన ఎన్ఎస్జీ కమెండోల చేతిలోనే పిస్టల్ పేలడం పోలీసు అధికారులను విస్మయానికి గురి చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.