: మరో బాదుడుకు సిద్ధమైన రైల్వే శాఖ
రైల్వే శాఖ మరోసారి ప్రయాణికులపై భారం మోపేందుకు సిద్ధమైంది. సంస్కరణల పేరుతో టికెట్ ధరల పట్టికను సవరించిన రైల్వే శాఖ, ఆదాయం మరింత పెంచుకునేందుకు రిజర్వేషన్ల ఉపసంహరణ ధరలను అమాంతం పెంచేసింది. రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కోరుతున్న రైల్వే శాఖ, వివిధ ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల నిర్వహణను ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా మరిన్ని నిధులు రాబట్టాలని భావిస్తోంది. ఇంతలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు రవాణా వ్యవస్థలో 5 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు హాఫ్ టికెట్ విధానం అమలులో ఉండేది. ఇకపై అర్ధ ఛార్జీ అనే మాట ఉండదని రైల్వే శాఖ చెబుతోంది. ఈ మేరకు నిబంధనలు సవరించనుంది. 5 ఏళ్లు దాటిన ఎవరైనా రైలెక్కితే పూర్తి ఛార్జీ చెల్లించాల్సిందేనని రైల్వే శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ నిబంధన 2016 ఏప్రిల్ నుంచి అమలులోకి రానుందని వారు వివరిస్తున్నారు.