: అవినీతి పరులు శ్మశానానికే... ఆప్ నేతలకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ వార్నింగ్
‘అవినీతి పరులను శ్మశానానికి పంపుతానంటూ’ ఆప్ నేతలకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వార్నింగ్ ఇచ్చారు. ఆయనపై ఢిల్లీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో బస్సీ ఘాటుగా స్పందించారు. 1990లో వెస్ట్ ఢిల్లీ కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన ఒక ప్లాట్ ఓనర్ ను బలవంతంగా ఖాళీ చేయించి, ఆ ప్లాట్ ను బస్సీకి కేటాయించారనే దానితో పాటు మరో ఆరోపణను కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాధికారులు చేస్తున్నారు. అలాగే, తనకి సొంత ఫ్లాట్ ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని వెల్లడించకుండా, సివిల్ సర్వీసెస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యుడిగా ఓ ఫ్లాట్ తీసుకున్నారని, చివరికి దానిని మార్కెట్ రేటు కంటే తక్కువకి తన తమ్ముడికి అమ్మేశారని, ఆ విధంగా స్టాంప్ డ్యూటీని ఎగ్గొట్టారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆరోపణలు రావడంతో బస్సీ మండిపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘లంచం తీసుకోవడమన్నది నాకు తెలియదు. అవినీతి పరులైన వారే నన్ను అవినీతి పరుడని అంటారు. అవినీతిపరులను శ్మశానానికి పంపిస్తాను’ అంటూ ఆప్ నేతలను హెచ్చరించారు. కాగా, ఈ వ్యాఖ్యలను ఆప్ నేత అశుతోష్ తిప్పికొట్టారు. హతమారుస్తానంటూ బస్సీ బహిరంగ హెచ్చరికలకు దిగడం ఆయన స్థాయికి తగదని అశుతోష్ హితవు పలికారు.