: ప్రపంచంలోనే అతిపెద్ద 'పీపీపీ' మనదే!
దేశవ్యాప్తంగా 400 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించాలని భారత ప్రభుత్వం చేపట్టిన భారీ పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ (పీపీపీ) ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా నిలువనుంది. ఈ విషయాన్ని శుక్రవారం నాడు రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు వివరించారు. పీపీపీ ప్రాజెక్టుల్లో ఇదే అత్యంత భారీ ప్రాజెక్టని వెల్లడించిన ఆయన మరిన్ని వివరాలను మాత్రం తెలియజేయలేదు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన పీపీపీ సదస్సులో ప్రసంగించిన ఆయన, ఇప్పటివరకూ రైల్వేలు కేవలం టికెట్, సరకు రవాణాలపై మాత్రమే ఆధారపడి ఆదాయం సంపాదించాయని, ఇకపై పరిస్థితి మారుతుందని వివరించారు. ఉపయోగంలో లేని ఆస్తులను వినియోగిస్తూ, సాలీనా 30 నుంచి 40 శాతం అదనపు ఆదాయం లక్ష్యంగా విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. నిపుణుల అంచనాల ప్రకారం, ఎంపిక చేసిన ఒక్కో రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ. 100 కోట్ల వ్యయం కానుంది. అంటే ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ. 40 వేల కోట్ల వరకూ ఉండవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా రైల్వే స్టేషన్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటిని వాణిజ్య అవసరాలు తీర్చేలా మార్చనున్నారు. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో మల్టీప్లెక్సులు రానుండగా, రైల్వేలకు ఉన్న ఆస్తుల్లో భాగంగా నిరుపయోగంగా ఉన్న స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు. కాగా, త్వరలోనే రైల్వే శాఖలో సెక్టోరల్ నియంత్రణా అధికారిని నియమించనున్నట్టు కూడా సురేష్ ప్రభు తెలిపారు.