: ఒబామా వాడే హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్ లోనే తయారైంది: కేటీఆర్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపయోగించే హెలికాప్టర్ క్యాబిన్ హైదరాబాద్ లోనే తయారైందని తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయం చెప్పేందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 60వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని... సంక్షేమం, అభివృద్ధిపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని కేటీఆర్ వెల్లడించారు. భవిష్యత్తు తరాలకు పవర్ కట్ అంటే తెలియకుండా చేస్తామని వివరించారు. పరిశ్రమలకు పవర్ హాలీడే లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగూడెం ప్లాంట్ లో 30 శాతం ఉత్పత్తి పెంచామని గుర్తు చేశారు. టీఆర్ఎస్ సత్తా ఏంటో జనవరి నెలాఖరు నాటికి చూపిస్తామన్నారు.