: దావూద్ ఇబ్రహీం ముగింపునకు తొలి అడుగు... అమెరికన్ పోలీసులకు చిక్కిన 'క్యాష్ పార్టీ'!
భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉండి, ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వ సాయంతో అక్కడే తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుల్లో ఒకడు, అతని ఆర్థిక వ్యవహారాలన్నీ పర్యవేక్షించే అల్తాఫ్ ఖనానీని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన యూఎస్ డ్రగ్ ఎన్ ఫోర్సుమెంట్ విభాగం అధికారులకు సెప్టెంబర్ 11న పట్టుబడ్డట్టు తెలుస్తోంది. ఆపై విచారించగా దావూద్ ఇబ్రహీంతో పాటు, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకూ ఖనానీ నిధులందించాడని గుర్తించారు. దావూద్ ఇబ్రహీంకు అతిపెద్ద ఫైనాన్షియర్ ఇతనేనని బలమైన సాక్ష్యాలను సంపాదించిన అమెరికా, ఇక దావూద్ ను టార్గెట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, యూఎస్, యూఏఈ తదితర దేశాల నుంచి అక్రమంగా నగదు పాకిస్థాన్ కు చేరవేసేందుకు అల్తాఫ్ స్వయంగా ఖనానీ మనీ లాండరింగ్ ఆర్గనైజేషన్ పేరిట సంస్థ ప్రారంభించాడని అధికారులు తెలిపారు. ఖనానీ అరెస్టుతో డీ-కంపెనీ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నట్టేనని, ఇక ఇప్పట్లో ఆర్థికంగా దావూద్ ఇబ్రహీం కోలుకోవడం కష్టమని తెలుస్తోంది. ఖనానీ అరెస్టు దావూద్ ముగింపునకు తొలిమెట్టుగా భావించవచ్చని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.