: తొమ్మిది ఇన్నింగ్స్ ల తరువాత శతకం!
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న 4 టెస్టుల సిరీస్ లో తొమ్మిది ఇన్నింగ్స్ ల తరువాత తొలిసారిగా శతకం నమోదైంది. న్యూఢిల్లీలో జరుగుతున్న చివరి టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత జట్టు ఆటగాడు రహానే 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవర్ నైట్ స్కోరు 231/7 వద్ద ఈ ఉదయం బ్యాటింగ్ కొనసాగించిన జట్టులో రహానే, ఆశ్విన్ లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో 180 బంతులాడిన రహానే 10 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ టెస్టు సిరీస్ తొలి మ్యాచ్ లో జరిగిన నాలుగు ఇన్నింగ్స్ లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. ఆపై రెండో టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్ తరువాత వరుణుడు అడ్డుకున్నాడు. ఇక మూడవ మ్యాచ్ 'లో స్కోరింగ్' మ్యాచ్ గా సాగి మూడు రోజుల్లోనే ముగిసింది. ఆఖరిదైన ఈ మ్యాచ్ లో 9 ఇన్నింగ్స్ ల తరువాత సెంచరీ నమోదైనట్లయింది. ప్రస్తుతం భారత స్కోరు 97 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు కాగా, రహానే 115, అశ్విన్ 21 పరుగులతో ఆడుతున్నారు.