: టీడీపీ తరఫున గెలిచింది 15 మంది... 9 మంది జంప్ జిలానీలు కాగా, మిగిలింది ఆరుగురు!
ఆనాడు టీఆర్ఎస్ పార్టీ తమ వారిని ప్రలోభపెట్టి లాగేసుకుంటుందని నానాయాగీ చేసిన వారే నేడు ఆ పార్టీలోకి దూకేందుకు క్యూ కట్టారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకుంటున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని గొంతు చించుకుని గవర్నర్ ఇంటి ఎదుట ధర్నా చేసి, అసెంబ్లీ పోడియంలోకి చొచ్చుకెళ్లి బైఠాయించి, సస్పెండయిన ఎమ్మెల్యేలు సైతం జంప్ జిలానీలయ్యారు. ఒకరి తరువాత ఒకరు టీఆర్ఎస్ లోకి మారిపోతుండగా, టీఆర్ఎస్ సైతం గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా, వారిలో ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న తదితరులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో మిగిలిన ఆరుగురన్నా ఐకమత్యంగా ఉంటున్నారా? అనుకుంటే, అదీ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి దారి ఒకటైతే, ఎర్రబెల్లిది మరో దారి. మిగిలిన వారిలో తన నియోజకవర్గంలో నీటి సమస్య తీరిస్తే టీఆర్ఎస్ లో చేరుతానని ప్రకాష్ గౌడ్ పలుమార్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి ఇంకా కొంతమంది తమ పార్టీలోకి రానున్నారని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పడం కొసమెరుపు.