: హైదరాబాద్ టు అమరావతి వయా విజయవాడ!
వచ్చే సంవత్సరం జూన్ 1 లోగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన మొత్తం రాజధాని అమరావతి నుంచే జరగాలి... ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మదిలోని ఆలోచన. ఇదే విషయమై అధికారిక ఆదేశాలూ జారీ అయ్యాయి. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించగా, అప్పటి నుంచి ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం మొదలైంది. వాస్తవానికి ఇప్పటివరకూ అమరావతిలో ఒక్క భవనం కూడా నిర్మాణం జరగలేదు. కనీసం పునాదులు కూడా పడలేదు. ఇక జూన్ లోగా పరిపాలనకు అవసరమైన సెక్రటేరియట్, వివిధ కార్యాలయాల భవనాలు ఎంత యుద్ధ ప్రాతిపదికన నిర్మించినా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి విజయవాడలోని అద్దె భవనాలకు, ఆపై అమరావతిలో భవన నిర్మాణాలు పూర్తయ్యాక, అక్కడికి మరో పర్యాయం కార్యాలయాలు తరలాల్సి వుంటుంది. ఇక విజయవాడలో అద్దెలు ఇప్పటికే కొండెక్కి కూర్చున్నాయి. ప్రభుత్వ ఆఫీసులకు ఏదైనా భవంతిని అద్దెకు అడిగితే, యజమానులు ఆమడ దూరం పారిపోతున్నట్టు తెలుస్తోంది. ఏడాదిపాటు అన్ని కార్యాలయాల భవనాలను అద్దెకు తీసుకుంటే, వాటి నిర్వహణకు ఎంతలేదన్నా రూ. 10 కోట్లు అవసరమవుతాయని అంచనా. అసలే అప్పుల్లో ఉన్న ఏపీకి ఈ అదనపు భారం భరించే శక్తి ఉందా? అన్నది మరో ప్రశ్న. ఉద్యోగులు లేవనెత్తుతున్న మరో ప్రధాన అనుమానం స్థానికత. తమ పిల్లల భవిష్యత్తు ఎటూ కాకుండా పోతుందన్న భయాందోళనల్లో ఉన్న ఉద్యోగులు, స్థానికత విషయమై స్పష్టత వస్తేనే ముందడుగు వేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, ఆలోచించి అడుగులు వేయాలని ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నాయి. జూన్ నాటికి ఉద్యోగులంతా తరలితే మాత్రం ఆంధ్రప్రదేశ్ పాలన 'హైదరాబాద్ టు అమరావతి, వయా విజయవాడ' అనుకోవాల్సిందే.