: చెన్నై ఆటో ఇండస్ట్రీకి నష్టం రూ. 15 వేల కోట్లు!
చెన్నైలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడులోని వాహన తయారీ సంస్థలు రూ. 15 వేల కోట్ల వరకూ నష్టపోయాయని అసోచామ్ అంచనా వేసింది. దేశంలోని రెండవ అతిపెద్ద అటో ఉత్పత్తుల హబ్ గా నిలిచిన చెన్నై దేశ వాహన అవసరాల్లో 25 శాతం వరకూ తీరుస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలెన్నో విడిభాగాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడీ కంపెనీల్లో మూడు నుంచి నాలుగడుగుల మేరకు నీరు నిండిపోయింది. వాహన సంస్థలతో పాటు ఇంజనీరింగ్, టెక్స్ టైల్స్ తదితర విభాగాల్లోని కంపెనీలూ దారుణంగా దెబ్బతిన్నాయి. "చెన్నైని ఆదుకునేందుకు ప్రధానమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని అసోచామ్ సభ్య కంపెనీలకు విజ్ఞప్తి చేశాము. సాధ్యమైనంత త్వరగా ప్రజలను కష్టాల కడలి నుంచి బయట పడేసేందుకు కృషి చేస్తాం" అని అసోచామ్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, నగరంలోని ప్రధాన వాహన తయారీ కంపెనీల యార్డుల్లో సుమారు 20 వేల నుండి 25 వేల వాహనాలు క్రయవిక్రయాలు జరగక నిలిచిపోయాయి. ఈ సంవత్సరాంతానికి రినాల్ట్ క్విడ్, హుండాయ్ క్రెటా కంపెనీల దగ్గర ఇప్పటికే 50 వేల నుండి 70 వేల యూనిట్ల వరకూ డెలివరీ చేయాల్సినవి వుండగా, వరదల కారణంగా వీటి పంపిణీ వాయిదా పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఎన్నో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ వాహనాల్లోకి నీరు చేరినట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఫోర్డ్ ఇండియా ప్లాంట్ మూతపడగా, ఐదు రోజుల నుంచి రినాల్ట్ నిస్సాన్ ప్లాంట్ మూతపడింది. చెన్నై కేంద్రంగా వాహనాల విడిభాగాలు తయారు చేసి ఎగుమతి చేస్తున్న జపాన్ సంస్థ సిన్సాన్, ఆదివారం తరువాతనే ఉత్పత్తిని తిరిగి చేపట్టనున్నట్టు వెల్లడించింది. హుందాయ్ మోటార్స్ నేటి నుంచి ప్రొడక్షన్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీలన్నీ ఎప్పుడు ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్న విషయమై స్పష్టత లేదు.