: అమెరికా కూడా స్పందించింది... చెన్నైకి సాయమందిస్తామని ప్రకటన


తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వరదలు ముంచెత్తాయి. వందేళ్ల నాటి రికార్డు వర్షపాతాన్ని మించి కురిసిన భారీ వర్షం కారణంగా నగరం జలసంద్రంగా మారింది. నగరంలోని ఏ ఒక్క చోట కూడా నేల కనిపించిన దాఖలా లేదు. ఈ పెను ఉత్పాతంపై అన్ని వర్గాలు స్పందించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న నేరుగా చెన్నై వచ్చి అక్కడి ప్రజల్లో భరోసా నింపారు. దేశంలో పలు రాష్ట్రాలు తమిళనాడుకు బాసటగా నిలిచాయి. చెన్నై విలయం యావత్తు భారత్ నే కాక అగ్రరాజ్యం అమెరికాను కూడా కదిలించింది. మొన్న వర్షం మొదలైన రోజే చెన్నైలోని ఆ దేశ కాన్సులేట్ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న అమెరికా విదేశాంగ శాఖ క్రమం తప్పకుండా పరిస్థితిని సమీక్షించింది. భారీ నష్టం జరిగిందని తెలుసుకున్న తర్వాత నిన్న ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మార్క్ టోనర్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెన్నై విలయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అత్యంత ముఖ్యమైన భాగస్వామ్య దేశానికి చెందిన రాష్ట్రంలో పెను విలయం సంభవించిందని, ఈ సమయంలో ఆపన్న హస్తం అందించేందుకు నిర్ణయించామని టోనర్ చెప్పారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి సమాచారం పంపామని, ఏ తరహా సహాయం కావాలో చెప్పమని అడిగామని ఆయన తెలిపారు. ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News