: చెన్నైకి ‘చెర్రీ’ కంపెనీ బాసట!... అరక్కోణం దాకా ట్రూజెట్ విమానాల సర్వీసులు
భారీ వర్షం, వరదలతో అతలాకుతలమైన చెన్నైకి అన్ని వర్గాల నుంచి సహాయం వెల్లువెత్తుతోంది. ఇప్పటికే కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించగా, పలు రాష్ట్రాలు కూడా తమ వంతుగా సహాయాన్ని ప్రకటించాయి. సినీ రంగ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో చెన్నైకి అండగా నిలిచేందుకు కదిలి వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ హీరో రాంచరణ్ తేజ్ కూడా రంగంలోకి దిగాడు. చెర్రీ భాగస్వామిగా ఉన్న ట్రూజెట్ ఏవియేషన్ విమాన సర్వీసులతో పాటు ఉచిత బస్సు సర్వీసులను నడిపేందుకు ముందుకొచ్చింది. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం నీటమునిగి విమాన సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాదు నుంచి అరక్కోణం దాకా విమాన సర్వీసులు నడిపేందుకు ట్రూజెట్ ముందుకొచ్చింది. ఇక అరక్కోణం నుంచి చెన్నైలోని కోయంబేడు దాకా ఉచిత బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆ సంస్ధ అధికారులు ప్రకటించారు. తద్వారా స్తంభించిన రవాణా వ్యవస్థను తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.