: ఏపీకి ‘హోదా’ అవసరమే... హస్తినలో గళం విప్పిన బాలయ్య
టాలీవుడ్ నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్నటి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. పార్లమెంటులో తన తండ్రి, దివంగత నందమూరి తారకరామారావు విగ్రహానికి నివాళులర్పించిన ఆయన, వరుస పెట్టి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, శ్రీకాకుళం ఎంపీ, టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు, బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబులు వెంటరాగా ఆయన కేంద్రంతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని అన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న నమ్మకం తనకుందని కూడా బాలయ్య వ్యాఖ్యానించారు. కరవు జిల్లా అనంతపురంను సస్యశ్యామలం చేసేందుకు ఏపీ సర్కారు తన వంతు కృషి చేస్తోందని చెప్పిన ఆయన, కేంద్రం కూడా తోచినంత మేర సహాయం చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బాలయ్య కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు, నితిన్ గడ్కరీ, మహేశ్ శర్మ, చౌదరి బీరేంద్ర సింగ్, పీయూష్ గోయల్ తదితరులతో భేటీ అయ్యారు.