: ఢిల్లీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫుల్ ఖుష్... భారీగా పెరిగిన వేతనాలు!
ఢిల్లీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఫుల్ ఖుష్ అయ్యే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నారు. ఢిల్లీ ప్రజా ప్రతినిధుల జీతాలు తక్కువగా ఉన్నాయని భావించిన కేజ్రీవాల్ గత నెలలో వారి జీతాలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారి జీతాలు అమాంతం నాలుగు రెట్లు పెరిగాయి. మంత్రులకు బేసిక్ వేతనాన్ని 20 వేల రూపాయల నుంచి 80 వేల రూపాయలకు పెంచగా, ఎమ్మెల్యేలకు 12 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలకు పెంచారు. దీనికి అదనంగా హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు అన్నీ కలుపుకుని వీరి జీతం నెలకు 2.1 లక్షలు కానుంది. అంటే, ప్రజాప్రతినిధుల జీతాలు ఏకంగా 400 శాతం పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఢిల్లీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఆనందంలో మునిగిపోయారు. పెరిగిన జీవన అవసరాలకు అనుగుణంగా జీతాలు సరి చేసినట్టు గతంలో కేజ్రీవాల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.