: చెన్నై వరద బాధితులకు సినీ నటుడు నిఖిల్ సాయం
చెన్నై వరద బాధితుల కష్టాలకు అంతా చలించిపోతున్నారు. దేశంలో ప్రఖ్యాత నగరంగా పేరొందిన చెన్నై వరదల ధాటికి నీట మునగడంతో చెన్నైవాసులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. సిద్ధార్థ్ లాంటి సినీ నటులు సోషల్ మీడియా ద్వారా చెన్నై వాసుల ఇబ్బందులు బయటపెట్టడంతో టాలీవుడ్ నటీనటులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా 'శంకరాభరణం' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ చెన్నై వరద బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. చెన్నైలోని ఏవీఎం సినిమా ఆధ్వర్యంలో పని చేస్తున్న ఎన్జీవోకు 5 లక్షల రూపాయల విలువైన ఆహారం, మందులు, ఇతర సామగ్రి అందజేస్తానని అన్నారు. క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఎన్జీవో ద్వారా సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు నిఖిల్ చెప్పాడు. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వంటివారు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.