: విజయవాడలో నకిలీ బాబా లీలలు
కృష్ణా జిల్లాలో భక్తులను ముంచిన ఓ నకిలీ బాబా ఉడాయించాడు. వందలాది మంది మహిళా భక్తులను వంచించిన నకిలీ బాబా భక్తుల నగలు, నగదుతో ఉడాయించిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. రెండేళ్ల నుంచి కృష్ణలంకలో మకాం వేసి, జాతకాలు చెబుతానని పేపర్ లో ప్రకటన ఇస్తూ పలువురిని ఆకట్టుకున్నాడు. కేవలం 150 రూపాయలకు సమస్యలు పరిష్కరిస్తానని నమ్మబలికాడు. నాలుగు నెలల క్రితం ఆఫీసును తెరిచాడు. అందులో మహిళా సిబ్బందిని నియమించి మోసానికి తెరతీశాడు. సమస్యలలో ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసానికి పాల్పడ్డాడు. తొలి రోజు ప్రత్యేక పూజలు చేస్తానని చెప్పి 150 రూపాయలు తన దగ్గరున్న డబ్బాలో వేయాలని చెప్పాడు. ప్రత్యేక పూజలు మూడు రోజులు చేయాలని ఆ తరువాత సమస్యలు తీరిపోతాయని చెప్పాడు. నాలుగో రోజు వాటిని వారికి తిరిగి ఇచ్చేసి, ఈ నగదు సరిపోవడం లేదు. దోషం పరిహారం కావడం లేదు. పూజలకు ఎదో శక్తి అడ్డు తగులుతోంది. ఈ సారి పూజలకు వెయ్యింపదహార్లు తీసుకునిరండి అని కోరేవాడు. నాలుగో రోజు దానిని తెరిచి ఇది కూడా సరిపోవడం లేదు, ఈ సారి పది వేల రూపాయలతో పూజలు చేద్దాం అని నమ్మబలికాడు. మూడు రోజులు గడిచిన తరువాత ఈ నగదుకి కూడా శక్తి సరిపోవడం లేదు, ఈ నగదుకు నగలు చేర్చండి ప్రత్యేక పూజలు చేస్తాను. దోషం పోతుందని నమ్మబలికాడు. దీంతో మూడు సార్లు డబ్బులు తిరిగి ఇచ్చేసిన బాబా ఈ సారి కూడా ఇచ్చేస్తాడు. లేని పక్షంలో తమ నగదు రెట్టింపు అవుతుందనే అత్యాశతో బంగారం కూడా అతని దగ్గరున్న మట్టి పాత్రలో భక్తుల నగలు, నగదు వేశారు. భక్తుల బలహీనతను బలంగా మార్చుకున్న నకిలీ బాబా వీటన్నింటినీ సర్దేసి, వాటితో ఉడాయించాడు. దీంతో భక్తులంతా లబోదిబో మంటూ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగులను నిర్బంధించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబా భారీగా మూటకట్టుకుని ఉడాయించినట్టు తెలుస్తోంది.