: కేసీఆర్ ను కలిసిన మాట వాస్తవం... కానీ కాంగ్రెస్ ను వీడను: దానం నాగేందర్ స్పష్టీకరణ
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ విసురుతున్న వలకు ఇతర పార్టీల నేతలు సులువుగానే చిక్కుతున్నారు. ఇందుకు నిదర్శనంగానే టీడీపీకి నమ్మిన బంటుగా ఉన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ లో చేరిపోయారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి డబుల్ షాక్ ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికే సాయన్నతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ గులాబీ కండువా కప్పేసుకున్నారు. తాజాగా ఆ పార్టీ గ్రేటర్ చీఫ్ దానం నాగేందర్ కూడా పార్టీ వీడనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నీ పుకార్లేనని దానం నాగేందర్ కొద్దిసేపటి క్రితం కొట్టిపారేశారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో భేటీ అయిన మాట వాస్తవమేనని ప్రకటించిన దానం, కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడబోనని స్పష్టం చేశారు. సొంత పార్టీకి చెందిన కొంతమంది నేతలు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని కూడా దానం ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న పార్టీలు ఇతర పార్టీ నేతలపైకి వల విసరడం సహజమేనని వ్యాఖ్యానించిన దానం, తాను మాత్రం ఆ వలకు చిక్కబోనని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ రచిస్తున్నానని తెలిపారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 24 నియోజకవర్గాల్లో అడ్ హక్ కమిటీలు వేసి ప్రజా మద్దతు ఉన్న నేతలకే పార్టీ టికెట్లు కేటాయిస్తానని ఆయన పేర్కొన్నారు.