: గులాబీ కండువా కప్పేసుకున్న సాయన్న, ప్రభాకర్
టీ టీడీపీ సీనియర్ నేత, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రభాకర్ లు కొద్దిసేపటి క్రితం తమ తమ పార్టీలకు చేయిచ్చి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారిద్దరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నేటి ఉదయం ఊహించని విధంగా సాయన్న, ప్రభాకర్ లు టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును కలిశారు. వారిద్దరినీ హరీశ్ రావు సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. స్వల్ప చర్చ తర్వాత వారిని కేసీఆర్ తన పార్టీలోకి చేర్చుకున్నారు. కేవలం నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామాలతో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు షాక్ కు గురయ్యారు. తాజా పరిణామాలతో తదుపరి చర్యల కోసం ఆయా పార్టీల నేతలు సమాయత్తమవుతున్నారు.