: డాషింగ్ సెహ్వాగ్ ను సన్మానించిన బీసీసీఐ


టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను బీసీసీఐ సన్మానించింది. భారత్-దక్షిణాఫ్రికాల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ఈ కార్యక్రమం జరిగింది. సెహ్వాగ్ కు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ జ్ఞాపికను బహూకరించి, సత్కరించారు. తన సొంత గడ్డ ఢిల్లీలో తనను సత్కరించడం పట్ల సెహ్వాగ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమానికి సెహ్వాగ్ ఇద్దరు కుమారులు కూడా హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) దూరంగా ఉండటం గమనార్హం. ఈ కార్యక్రమానికి సంబంధించి తమకు బీసీసీఐ నుంచి మెయిల్ వచ్చిందని... అయితే వీరూను అధ్యక్షుడు సన్మానిస్తారా? లేక కార్యదర్శి సన్మానిస్తారా? అనే విషయాన్ని తెలపలేదని డీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ చేతన్ చౌహాన్ అన్నారు. అంతేకాక, బీసీసీఐ తమకు ఇచ్చిన సమయం తాము సిద్ధం కావడానికి సరిపోదని చెప్పారు. ఢిల్లీకి ఎంతో సేవ చేసిన సెహ్వాగ్ ను తాము మరోసారి ఘనంగా సత్కరిస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News