: చీఫ్ గెస్టుగా రావడానికి సానియా గొంతెమ్మ కోరికలు!
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గొంతెమ్మ కోరికలు కోరడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమెను ముఖ్య అతిథిగా పిలువలేదని తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన యాన్యువల్ స్పోర్ట్స్ అవార్డ్స్ కార్యక్రమానికి సానియాను ముఖ్యఅతిథిగా పిలవాలని క్రీడా మంత్రిత్వ శాఖ, యూత్ వెల్ఫేర్ అధికారులు మొదట అనుకున్నారు. సానియా అనుమతి కోసం అధికారులు ఆమెను సంప్రదించారు. అయితే, సానియా ముఖ్యఅతిథిగా రావాలంటే రూ.75,000 విలువ చేసే ఒక మేకప్ కిట్ ఇవ్వాలని, ఆమె ప్రయాణానికి ఒక చార్టెడ్ ఫ్లైట్ ను వినియోగించాలని, సహాయకుల కోసం బిజినెస్ క్లాస్ లో ఐదు టిక్కెట్లు బుక్ చేయించాలని సానియా పర్సనల్ అసిస్టెంట్ డిమాండ్ చేసిందట. ఇక తన ఫీజుగా ఆమె ఎంత అడిగిందన్నది మాత్రం తెలియరాలేదు. ఈ సందర్భంగా విలేకరులతో ఆ రాష్ట్ర క్రీడల మంత్రి యశోదర రాజే మాట్లాడుతూ, టెన్నిస్ క్రీడా కారిణిగా సానియాను గౌరవిస్తాము కానీ, ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చడం మాత్రం కష్టమన్నారు. ఆ డిమాండ్లకు సదరు మంత్రిత్వ శాఖ అంగీకరించకపోవడంతో సానియా ముఖ్య అతిథిగా వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో, సానియా స్థానంలో ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. సానియా కారణంగా గత నవంబర్ 28వ తేదీన జరగాల్సిన కార్యక్రమం ఈ నెల 1వ తేదీన జరిగిందని అధికారులు ఆరోపించారు.