: తమిళనాడు భారీ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించండి: అన్నాడీఎంకే డిమాండ్
భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం నీట మునిగిపోవడంతో జాతీయ విపత్తుగా ప్రకటించాలని అన్నాడీఎంకే పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు లోక్ సభలో ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్ బాబు మాట్లాడుతూ, భారీ వర్షాలతో కుదేలైన తమ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుండపోత వర్షం, ప్రకృతి ప్రకోపం కారణంగా తమ రాష్ట్రం అతలాకుతలమైందని చెప్పారు. భారీ వర్షాలతో తలెత్తిన సమస్యలను ఎదుర్కోవడానికి తమ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక నీటి నిర్వహణ ప్రణాళికలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.