: చెన్నైలో సహాయ చర్యలకు ఆటంకాలు... పొంగిపొర్లుతున్న రిజర్వాయర్లు... నిండిపోయిన అడయార్ నది
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమైంది. నగరంలో ఎక్కడ చూసినా నడుంలోతు, పీకల్లోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి. దాంతో సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యం బృందాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వెళ్లలేకపోతున్నాయి. ఈ క్రమంలో సహాయ చర్యలకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. రిజర్వాయర్లన్నీ ఓవర్ ఫ్లో అవడంతో దిగువ ప్రాంతాల్లో ఉన్న కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. సహాయ చర్యలు చేసేందుకు కూడా వీలులేని పరిస్థితి ఏర్పడింది. నగర శివార్లలో ఉన్న రిజర్వాయర్లతో పాటు అడయార్ నది నిండిపోయింది. వరదనీరంతా చెన్నై నగరంలోకి చేరుకోవడంతో జలదిగ్బంధమైంది. దాంతో వాహనాలన్నీ కదల్లేని పరిస్ధితి ఏర్పడింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అన్ని రహదారులలో పడవల్లో మాత్రం తిరగగలిగే అవకాశం ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలు కావట్లేదు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నా వరదనీరు పెరుగుతుండటంతో ఏమీ చేయలేకపోతున్నారు. గత రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. చాలా ప్రాంతాల్లో ఫోన్లు పనిచేయడం లేదు. చెన్నై విమానాశ్రయం పూర్తి వరదనీటితో మునిగిపోయింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ప్రభుత్వ ఆఫీసులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. కొంతమంది పై అంతస్తుల్లో తలదాచుకుంటున్నారు. మరికొంతమంది వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు.