: చంద్రబాబు పర్యటనపైనా వర్షం ఎఫెక్ట్... ఏపీ సీఎం తిరుపతి పర్యటన రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలను అతలాకుతలం చేసేశాయి. ఈ వర్షం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి పర్యటనపైనా ప్రభావం చూపింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో నేడు చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత ఇటీవల కురిసిన భారీ వర్షాలపై ఆయన అధికారులతో సమీక్ష కూడా చేయాల్సి ఉంది. అయితే మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రవాణా వ్యవస్థ కూడా దాదాపుగా స్తంభించింది. చిత్తూరు జిల్లాలోనూ తూర్పు మండలాలను వరద ప్రవాహం ముంచెత్తింది. ఈ కారణంగా చంద్రబాబు పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించని కారణంగా తిరుపతి పర్యటన ఇబ్బందికరమేనన్న భద్రతాధికారుల సలహాతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు.