: సైకిలెక్కేసిన ఆనం బ్రదర్స్... సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు చేయిచ్చిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కొద్దిమంది అనుచరగణంతో కలిసి నెల్లూరు నుంచి విజయవాడ చేరుకున్న ఆనం బ్రదర్స్ నేరుగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును ఆయన గెస్ట్ హౌస్ లో కలిశారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం చేరుకున్న వారిని చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆనం సోదరులకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నెల్లూరుకు చెందిన మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అతి కొద్ది మంది ముఖ్య అనుచరులతో కలిసి వచ్చిన ఆనం బ్రదర్స్ నిరాడంబరంగా పార్టీలో చేరిపోయారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భారీ బహిరంగ సభకు వారు సన్నాహాలు చేస్తున్నారు.