: 99 శాతం షేర్లు సేవా కార్యక్రమాలకే!... ఫేస్ బుక్ చీఫ్ జుకెర్ బర్గ్ సంచలన నిర్ణయం
సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ది తొలి విజయవంతమైన అడుగు. విశ్వవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఒకే వేదికపైకి చేర్చిన 'ఫేస్ బుక్' సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకెర్ బర్గ్ అత్యంత పిన్న వయసులోనే బిలియనీర్ గా అవతరించాడు. ప్రస్తుతం 31 ఏళ్ల వయసున్న జుకెర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ ల ఉమ్మడి ఆస్తి 45 బిలియన్ డాలర్ల పై మాటే. ఇటీవలే ఈ దంపతులకు ఓ కూతురు జన్మించింది. పుట్టబోయే కూతురు కోసం జుకెర్ బర్గ్ ఏకంగా రెండు నెలల పితృత్వ సెలవు తీసుకున్న సంగతి తెలిసిందే. వారం క్రితం జన్మించిన తమ కూతురుకు జుకెర్ బర్గ్ దంపుతులు ‘మ్యాక్స్’గా నామకరణం చేసుకున్నారు. అంతేకాదు, మ్యాక్స్ కు రాసిన బహిరంగ లేఖలో ఆ దంపతులు సంచలన విషయాన్ని ప్రకటించారు. తమ ఆస్తిలోని 99 శాతాన్ని (99 శాతం షేర్లు) సేవా కార్యక్రమాలకే వినియోగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని సక్రమ రీతిలో ఖర్చు చేసేందుకు ‘ద చాన్ జుకెర్ బర్గ్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఈ యువ దంపతులు ప్రకటించారు.