: పన్ను ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘన... కార్తీ చిదంబరం కంపెనీల్లో సోదాలకు కారణాలట!
2జీ కుంభకోణంలో భాగమైన ఎయిర్ సెల్-మ్యాక్సిస్ ఒప్పందం అవకతవకల్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కంపెనీల్లో నిన్న ఆదాయపన్ను(ఐటీ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారన్న వార్తా కథనాలు వాస్తవం కాదట. పన్ను ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘనలే కారణమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత సీబీడీటీ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కార్తీ ఆధ్వర్యంలోని కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడటమే కాక, ఫెమా నిబంధనలను ఉల్లంఘించాయన్న విశ్వసనీయ సమాచారంతోనే ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేశారని ఆ సంస్థ పేర్కొంది. పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ, ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈడీ అధికారులు సోదాలు చేశారని తెలిపింది. సోదాల్లో అవకతవకలు బయటపడితే ఆయా సంస్థలు వేర్వేరుగా కేసులు నమోదు చేయనున్నట్లు కూడా సీబీడీటీ ప్రకటన వెల్లడించింది. కార్తీ కంపెనీల్లో సోదాలకు రాజకీయ కారణాలేమీ లేవని కూడా ఆ ప్రకటన విస్పష్టంగా పేర్కొంది. చెన్నై, తిరుచురాపల్లిలోని కంపెనీల్లో సోదాలు జరిగాయని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని కూడా సీబీడీటీ తెలిపింది.