: మెక్ గ్రాత్, మురళీధరన్ లు మాత్రమే భయపెట్టారు... ఫేస్ బుక్ లో రాహుల్ ద్రావిడ్
‘వాల్’గా పేరుగాంచిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో ఇద్దరంటే ఇద్దరు బౌలర్లకు మాత్రమే భయపడ్డాడట. వన్డే మ్యాచ్ అయినా, టెస్టు మ్యాచ్ అయినా... రాహుల్ ద్రావిడ్ ను క్రీజులో నుంచి పెవిలియన్ చేర్చడమంటే బౌలర్లకు చికాకెత్తేది. ఓ పట్టాన అతడు ఔటయ్యే వాడు కాదు. ఇలా గంటల తరబడి క్రీజులో నిలదొక్కుకున్న ద్రావిడ్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తన సుదీర్ఘ కెరీర్ లో అన్ని దేశాల బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నానని, అయితే ఇద్దరు బౌలర్లు మాత్రం తనను ఇబ్బంది పెట్టారని ద్రావిడ్ ఫేస్ బుక్ లో తన అభిమానులకు చెప్పాడు. వీరిలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఒకరని అతడు చెప్పాడు. మెక్ గ్రాత్ ఆఫ్ స్టంప్ లపైకి విసిరే బంతులను అంచనా వేయడంలో చాలా ఇబ్బంది పడ్డానని కూడా అతడు పేర్కొన్నాడు. ఇక శ్రీలంకకు చెందిన స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ అన్నా భయపడేవాడినని ద్రావిడ్ చెప్పాడు. మురళీధరన్ చేసే బౌలింగ్ బిగుతుగా ఉండేదని ద్రావిడ్ వ్యాఖ్యానించాడు.