: లోకేశ్ ను ప్రమోట్ చేసుకునేందుకే చైతన్య యాత్రలు: రఘువీరా
తెలుగుదేశం పార్టీ ఇవాళ ప్రారంభించిన జన చైతన్య యాత్రలపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపణలు సంధించారు. టీడీపీ చేసేది జన చైతన్య యాత్ర కాదని... ప్రజా వంచన యాత్ర అంటూ ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ ను ప్రమోట్ చేయడానికే యాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. జన చైతన్య యాత్రలు అనకుండా టీడీపీ చైతన్య యాత్రగా పేరు మార్చుకోవాలని సలహా ఇచ్చారు. హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చలేకపోయిందో యాత్రల్లో వివరించాలని రఘువీరా డిమాండ్ చేశారు. రైతు, డ్వాక్రా, చేనేత రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని నిలదీశారు. 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను ఎందుకు పెండింగ్ పెట్టారో ప్రజలకు చెప్పాలన్నారు.