: సినిమాలో హెల్మెట్ తో జూనియర్ ఎన్టీఆర్... రియల్ లైఫ్ లో గొడుగు పట్టిన చింటూ రాయల్!


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ హత్య కేసుకు సంబంధించి నిన్న చిత్తూరు జిల్లా కోర్టులో టాలీవుడ్ హిట్ మూవీ ‘స్టూడెంట్ నెంబర్ వన్’ చిత్రంలోని ఓ సన్నివేశం కనిపించింది. తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆ చిత్రంలో పోలీసుల కళ్లుగప్పి కోర్టు హాలులోకి వెళ్లేందుకు చిత్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ హెల్మెట్ పెట్టుకుంటాడు. బైక్ పై కోర్టు ఆవరణలోకి దూసుకొచ్చే ఎన్టీఆర్ హెల్మెట్ తోనే కోర్టు హాలులోకి పరుగులు పెడతాడు. కోర్టు హాలు వద్ద ముఖానికి పెట్టుకున్న హెల్మెట్ తీసిన హీరోను చూసి పోలీసులు షాక్ కు గురవుతారు. పోలీసులు షాక్ నుంచి తేరుకునేలోగానే జూనియర్ ఎన్టీఆర్ కోర్టు హాలులోకి వెళ్లిపోతాడు. నిన్న చిత్తూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలోనూ ఇదే తరహాలో ‘కఠారి’ హంతకుడిగా భావిస్తున్న చింటూ రాయల్ అలియాస్ శ్రీరామ చంద్రశేఖర్ పోలీసుల కళ్లుగప్పి కోర్టు హాలులోకి వెళ్లాడు. జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఉన్నారని తెలుసుకున్న చింటూ, ఇదే అదనుగా భావించి ఆల్టో కారులో కోర్టు ప్రాంగణంలోకి వచ్చేశాడు. కారు దిగిన వెంటనే ఓ గొడుగును విప్పిన చింటూ దానిని తన తలపై పెట్టుకుని ముఖం కనిపించకుండా కోర్టు హాలు దిశగా నడిచాడు. గొడుగు పట్టుకుని వెళుతున్న చింటూను ఏ ఒక్కరు గుర్తు పట్టలేదు. కోర్టు హాలు వద్దకెళ్లిన చింటూ అప్పటిదాకా పట్టుకున్న గొడుగును మూసేశాడు. అంతే, అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈలోగానే న్యాయమూర్తి చాంబర్ లోకి వెళ్లిన చింటూ జడ్జీకి ఓ పిటిషన్ ను అందజేసి తాను లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. ఊహించని విధంగా చింటూ కోర్టుకు వచ్చాడని తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించి హుటాహుటిన కోర్టుకు పరుగులు పెట్టారు. అప్పటికే న్యాయమూర్తి వద్ద చింటూ లొంగిపోయాడని తెలుసుకుని ఆయన నిరాశకు లోనయ్యారు.

  • Loading...

More Telugu News