: అధికారుల అవినీతి కూడా రైతు ఆత్మహత్యలకు కారణమవుతోంది: హైకోర్టు
తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలపై ఉమ్మడి హైకోర్టులో ఈరోజు కూడా విచారణ జరిగింది. టి.జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, తదితరులు వేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ దిలీప్ బి.భోసలే, ఎస్ వి భట్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరపు న్యాయవాదులు... ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను కోర్టుకు వివరించారు. అంతేగాక ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికలపై కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఇన్ని పథకాలు ఉన్నా క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా? అన్న సందేహం వ్యక్తం చేసింది. కాగితాలపై ఉన్న పథకాలు రైతులకు చేరుతున్నాయా? అని ప్రశ్నించింది. పథకాల వివరాలు, వాటిని పొందే విధానాలపై, ఆత్మహత్యలు చేసుకోకుండా రైతుల్లో అవగాహన పెంచాలని కోరింది. రైతుల ఆత్మహత్యలకు అధికారుల అవినీతి కూడా కారణమవుతోందని, అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని ధర్మాసనం సూచించింది. రైతుల ఆత్మహత్యలు పూర్తిగా ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.