: అసహనంపై అమీర్ ఖాన్ కు షారుక్ మద్దతు
ఇటీవల అసహనంపై వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యవహారంపై మరో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ స్పందించాడు. అమీర్ కు మద్దతు పలికాడు. ఏ ఒక్కరికీ ప్రత్యేకంగా దేశభక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఆంగ్ల చానల్ తో మాట్లాడుతూ అన్నాడు. దేశభక్తి అనేది తనకు తానుగా మనసులో ఉంచుకోవాల్సిన భావన అని చెప్పాడు. దేశానికి మంచి జరగాలని ఆలోచించడం, మంచి చేయడం తప్ప దేశభక్తిని ఏ మార్గం ద్వారాను నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదని షారుక్ పేర్కొన్నాడు. అలాకాకుండా అవినీతిపరుడైతే దేశానికి హాని కలుగుందని అన్నాడు. ఇదే సమయంలో సోషల్ నెట్వర్క్ సైట్లపై కూడా కింగ్ ఖాన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. స్వేచ్ఛగా అభిప్రాయాన్ని చెప్పేందుకు పలు సైట్లు అనుకూలంగా ఉన్నాయని, అయితే సాధారణంగా చేసే వ్యాఖ్యలు కూడా సంచలనాలుగా మారుతున్నాయని అన్నాడు. అందుకే తనకు అవగాహన ఉన్న అంశాలపైనే మాట్లాడతానని బాద్షా స్పష్టం చేశాడు.