: ముస్లింలపై నా మాటలు వంద శాతం నిజం: డొనాల్డ్ ట్రంప్
అమెరికా మన్ హటన్ లోని ట్విన్ టవర్స్ (వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై ఉగ్రవాద దాడుల తరువాత వేలాది మంది ముస్లింలు సంతోషించారంటూ ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గతవారం వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ముస్లింలపై తాను చేసిన వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనని తాజాగా ట్రంప్ ఉద్ఘాటిస్తున్నారు. 2001 సెప్టెంబర్ 11న భయానక దాడులు జరిగాక జెర్సీ సిటీలో ముస్లింలు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నట్టు చూపే వీడియోలు కూడా ఉన్నాయని చెప్పారు. వాటిని తాను మాత్రమే కాకుండా అనేక మంది చూశారని తెలిపారు. తాము కూడా ఇలాంటి సంబరాలను చూశామని చెబుతూ వందలాది మంది ట్విట్టర్ ద్వారా తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యల ప్రభావం ఆయన విజయావకాశాలపై పడింది. ఒపీనియన్ పోల్స్ లో మద్దతిచ్చేవారు 43 శాతం నుంచి 31 శాతానికి తగ్గిపోయారు.