: 40 ఫ్లోర్ల ఏపీ సెక్రటేరియట్ ఖర్చు రూ.3 వేల కోట్లు... టాప్ ఫ్లోర్ లో సీఎం పేషీ!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కొత్తగా ఏర్పాటు కానున్న సచివాలయానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఓ బ్లూ ప్రింట్ ను అందజేశారట. మొన్న అమరావతికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలోనే సెక్రటేరియట్ ను నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. తూర్పు దిశకు అభిముఖంగా ఏర్పాటు కానున్న 40 అంతస్తుల భారీ భవంతిలో సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ భవంతిలోనే ఆయా శాఖలకు చెందిన మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనరేట్లను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారట. ఇక 40 అంతస్తుల భారీ భవంతిలో ఒక్కో ఫ్లోర్ లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశించారు. ఒక్కో ఫ్లోర్ లో ఏయే కార్యాలయాలు ఉండాలన్న విషయంపైనా చంద్రబాబు ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలుస్తోంది. కింది ఫ్లోర్లలో మంత్రుల చాంబర్లు, ఇతర అధికారులకు కేటాయించి టాప్ ఫ్లోర్ (40వ అంతస్తు)లో మాత్రం సీఎం కార్యాలయంతో పాటు భారీ కాన్ఫరెన్స్ హాల్ ను ఏర్పాటు చేయనున్నారట. ఇక ఈ భవంతి నిర్మాణం కోసం రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు కానుందని అంచనా.