: తాజ్ మహల్ ను హిందూ ఆలయంగా ప్రకటించేందుకు ఆధారాలు లేవు: కేంద్రం విస్పష్ట ప్రకటన
ప్రేమకు చిహ్నంగా నిలిచిన ఆగ్రాలోని తాజ్ మహల్ ను హిందూ ఆలయంగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ సమాధానమిచ్చారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్ మహల్ స్థానంలో 17వ శతాబ్దానికి ముందు శివాలయం ఉండేదని ఆగ్రాకు చెందిన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివాలయం ఉన్న స్థలంలో నిర్మించిన తాజ్ మహల్ ను హిందూ దేవాలయంగానే పరిగణించాలని, అక్కడ ప్రార్థనలు చేయకుండా ముస్లింలను నిరోధించాలని కూడా ఆగ్రా న్యాయవాదులు తమ పిటిషన్ లో సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే పురావస్తు శాఖ కూడా అక్కడ శివాలయం ఉందన్న వాదనను కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో నిన్న ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సందర్భంగా తాజ్ మహల్ ను హిందూ ఆలయంగా ప్రకటించలేమని మహేశ్ శర్మ తేల్చిచెప్పారు.