: రాజ్ నాథ్, సలీం మధ్య వాగ్వాదం... మా పొరపాటు కారణంగానే: సారీ చెప్పిన ‘ఔట్ లుక్’


నిన్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సీపీఎం సభ్యుడు మహ్మద్ సలీం, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. 800 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో అసలైన హిందూ పాలకుడు వచ్చాడంటూ రాజ్ నాథ్ ను ఉద్దేశించి సలీం వ్యాఖ్యానించడంతో రభస మొదలైంది. తనపై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించిన సలీం బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని రాజ్ నాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తామేమీ సొంతంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని, రాజ్ నాథే స్వయంగా ఈ మేరకు వ్యాఖ్యానించారని చెప్పిన సలీం... అందుకు సాక్ష్యంగా ‘ఔట్ లుక్’ పత్రిక ప్రతిని చూపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ‘ఔట్ లుక్’ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎక్కడో తప్పు జరిగిందని పేపర్లు తిప్పారు. పొరపాటు బయటపడింది. హిందూ పాలకుడి వ్యాఖ్యలు రాజ్ నాథ్ చేసినట్లుగా పొరపాటుగా ప్రచురించినట్లు గుర్తించారు. ఆ వ్యాఖ్యలు దివంగత విశ్వహిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్ చేశారని తేలింది. అయితే అశోక్ సింఘాల్ పేరుకు బదులుగా రాజ్ నాథ్ సింగ్ పేరును ప్రచురించినట్లు గుర్తించి నాలిక్కరచుకుంది. వెంటనే గురుతర బాధ్యతను గుర్తించి బేషరతుగా క్షమాపణలు చెబుతూ ‘ఔట్ లుక్’ ట్విట్టర్ లో తన సందేశాన్ని పోస్ట్ చేసింది. ‘‘జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం. పార్లమెంటును గాని, హోం మంత్రిని గాని అగౌరవపరచాలన్నది మా అభిమతం కాదు. మా పొరపాటు వల్ల రాజ్ నాథ్, సలీంల మధ్య జరిగిన వాగ్వాదానికి చింతిస్తున్నాం’’ అని ఆ పోస్టుల్లో ‘ఔట్ లుక్’ పత్రిక విచారం వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News