: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోం: దిగ్విజయ్ సింగ్
తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి జరగనున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుపెట్టుకోమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలను డిగ్గీ రాజా తోసిపుచ్చారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలతో పాటు భవిష్యత్ లో జరిగే ఏ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో పొత్తు ఉండదన్నారు. దిగ్విజయ్‌తో భేటీలో వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాల్లో ఉన్న పరిస్థితులతో పాటు వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలపై కూడా చర్చ జరిగిందని ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.