: వరంగల్ ఉపఎన్నికలో విఫలమయ్యాం: వైసీపీ నేత పొంగులేటి
వరంగల్ ఉపఎన్నికలో ఓటమిపై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ పార్టీ కార్యాలయంలో విశ్లేషణ చేసుకున్నారు. దివంగత వైఎస్ ఇప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని ఈ ప్రాంత వైసీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే ఈ ఎన్నికలో ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడంలో విఫలమయ్యామని చెప్పారు. వరంగల్ ఉప ఎన్నిక వైఫల్యాలకు కారణాలను విశ్లేషించామన్నారు. తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు వచ్చే అన్ని ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. ఇంకా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. త్వరలో తమ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని పొంగులేటి చెప్పారు.