: పారిస్ సదస్సులో మోదీ, షరీఫ్ కరచాలనం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు వేదికగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ లు కలుసుకున్నారు. సదస్సుకు హాజరైన సందర్భంగా వారిద్దరూ నవ్వుతూ కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 140 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. భారత్, పాక్ మధ్య చర్చల విషయంలో కొంతకాలంగా ప్రతిష్టంభన ఏర్పడిన సంగతి తెలిసిందే. చర్చల విషయంలో భారతే ముందుకు రావాలని ఆ మధ్య పాక్ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తాజాగా మోదీ, షరీఫ్ లు కలవడం గమనార్హం.