: నిర్మాతగా త్వరలో నా అదృష్టాన్ని పరీక్షించుకుంటా: దీపికా పదుకొణె


తాను భవిష్యత్తులో నిర్మాతగా మారే ఉద్దేశం వుందని అంటోంది బాలీవుడ్ నటి దీపికా పదుకొణె. రణబీర్ కపూర్ సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం 'తమాషా' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఈ నటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిత్ర నిర్మాణ రంగం వైపు త్వరలో తన ప్రయాణం సాగుతుందని చెప్పింది. నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటానని అంటోంది. అయితే, డబ్బుల కోసం తాను నిర్మాతగా మారాలని అనుకోవడం లేదని... ఓ నిర్మాతకు కావాల్సిన లక్షణాలు తనకు ఉన్నాయని...అందుకే ఈ దిశగా త్వరలో అడుగులు వేస్తానంటూ దీపిక చెప్పుకొచ్చింది. లాభం, నష్టం, బాక్సాఫీసు... వంటి బిజినెస్ అంశాలను తాను పట్టించుకోనని పేర్కొంది. ‘మీరు నటించిన చిత్రాలకు మీరే నిర్మాతగా వ్యవహరించాల్సి వచ్చినట్టయితే ఏ సినిమాను ఎంచుకుంటారు?’ అని విలేకరులు ఆమెను ప్రశ్నించగా... ‘పీకూ, లవ్ ఆజ్ కల్, కాక్ టెయిల్, తమాషా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి ఉండే దానిని. ఎందుకంటే, ఈ చిత్రాలు నా మనస్సుకు ఎంతో దగ్గరైనవి, ప్రత్యేకమైనవి’ అంటూ దీపికా పదుకొణె సమాధానమిచ్చింది. కాగా, అనుష్కశర్మ, శిల్పాశెట్టి, దియా మీర్జా, లారా దత్తా వంటి బాలీవుడ్ నటీమణులు ఇప్పటికే నిర్మాతల అవతారమెత్తారు.

  • Loading...

More Telugu News