: అతనికి క్షమాపణ చెప్పు: సినీ నటుడు గోవిందాకు సుప్రీంకోర్టు ఆదేశం
బాలీవుడ్ నటుడు గోవిందా తనకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ సంతోష్ రాయ్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా చేసిన పోరాటం చివరకు ఫలించింది. సంతోష్ కు క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాను సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే, 2008లో సంతోష్ రాయ్ చెంపను గోవిందా ఛెళ్ళుమనిపించాడు. ముంబైలోని ఫిల్మిస్థాన్ స్టూడియోస్ లో 'మనీ హైతో హానీ హై' అనే సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో, గోవిందా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. అనంతరం, పట్టువదలని విక్రమార్కుడిలా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సంతోష్. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను రూ. 5-6 లక్షలను ఖర్చు చేశానని కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో, సుప్రీంకోర్టు సంతోష్ రాయ్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. సంతోష్ కు క్షమాపణలు చెప్పాలంటూ గోవిందాకు ఆదేశాలు జారీ చేసింది.