: రిటైర్ మెంట్ యోచన లేదు... వార్త రాసిన విలేఖరి కోరికే అది!: పారికర్ కామెంట్
త్వరలో తాను క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ మాట మార్చారు. రాజకీయ సన్యాసంపై అసలు తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొన్న గోవాలోని మపుసాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా "60 ఏళ్ల తరువాత ప్రతి ఒక్కరూ పదవీ విరమణ గురించి ఆలోచిస్తారు. నాకు డిసెంబరు 13తో 60 దాటుతాయి. ఈ విషయమై రెండు మూడేళ్ల క్రితమే ఆలోచన ప్రారంభించాను. ఇకపై పెద్ద బాధ్యతలను మోయాలని అనుకోవడం లేదు" అని ఆయన మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో పారికర్ ఘాటుగా స్పందించారు. ‘‘అది నా రిటైర్మెంట్ వార్త రాసిన విలేకరి కోరిక అయి ఉంటుంది. ఎందుకంటే మొన్నటి కార్యక్రమంలో సదరు విలేకరి అక్కడ లేరు’’ అని పారికర్ కాస్తంగా ఘాటుగానే స్పందించారు.